హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని 2033 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యాచరణకు మరింత వేగం పెంచనుంది. రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శులతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌కు చెందిన GFST వైస్ చైర్మన్ ఎస్.పీ. టక్కర్‌తో పాటు GFST ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, అమలు వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ధి ఫలితాలను నిరంతరం పర్యవేక్షించేలా వ్యవస్థలను రూపొందించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘంను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రాధాన్యతా అభివృద్ధి కార్యక్రమాలకు వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, పురోగతిని వేగవంతం చేయడం వంటి బాధ్యతలను పీఎంయు నిర్వహించనుంది.
2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక, లక్ష్యిత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పేదరికానికి గురయ్యే కుటుంబాలను గుర్తించి, వారికి అందాల్సిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాల ఫలితాలను కొలిచేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణను 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతమైన, కేంద్రీకృత అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించనున్నారు. రాష్ట్రంలోని బలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధికి కొత్త అవకాశాలను అంది పుచ్చుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన నిపుణులు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించు కోవాలని నిర్ణయించారు. ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక సహకారాన్ని నిపుణుల ద్వారా పొందనున్నారు. వ్యూహాత్మక ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం, నాలెడ్జ్ సపోర్ట్, సామర్థ్య నిర్మాణం, పర్యవేక్షణ, కీలక అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు తెలంగాణ ప్రభుత్వం–GFST మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకునే ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
