హైదరాబాద్ : హైదరాబాద్ లో ని ప్రగతి నగర్ అంబర్ సరస్సును అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ప్రకటించారు. సరస్సులోని ఆక్రమణలను తొలగించి, పేరుకు పోయిన పూడికను తీసివేయడం ద్వారా దాని సహజ రూపురేఖలను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అంబర్ సరస్సును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరస్సు పక్కన జమ్మి మొక్కను నాటే కార్యక్రమానికి కూడా కమిషనర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు 162 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు, ప్రస్తుతం 121.2 ఎకరాలకు తగ్గి పోయిందని తెలిపారు. ఆక్రమణలను తొలగించడం ద్వారా దీనిని 135.8 ఎకరాలకు విస్తరిస్తామని చెప్పారు. సరస్సు చుట్టూ కట్ట నిర్మించడంతో పాటు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆటస్థలాలు, ఓపెన్-ఎయిర్ జిమ్‌లు , ప్రజలు ప్రశాంతంగా కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సరస్సు మధ్యలో ఉన్న కొండల వద్ద సాహస క్రీడలను అందుబాటులోకి తెస్తామన్నారు.
అంతే కాకుండా బోటింగ్ జెట్టీలను నిర్మించి బోటింగ్ , వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ‘కంకరియా లేక్ కార్నివాల్’ తరహాలో ప్రగతి నగర్లో ‘అంబర్ లేక్ ఫెస్టివల్’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నివాస ప్రాంతాలతో నిండిన ఈ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో అంబర్ సరస్సును పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. సరస్సు సహజ లక్షణాలను పునరుద్ధరించడం వల్ల ఈ ప్రాంతంలో వరదలను నివారించవచ్చని , భూగర్భ జలమట్టాలను మెరుగు పరచవచ్చని ఆయన పేర్కొన్నారు. 10.23 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం నుండి భారీగా వరద నీటిని తీసుకువచ్చే సరస్సులోని ఆరు ప్రవేశ మార్గాలను (ఇన్లెట్లను) అభివృద్ధి చేస్తామని, తద్వారా వర్షపు నీరు నేరుగా సరస్సులోకి ప్రవహించేలా చేస్తామన్నారు.
దుర్వాసనను తొలగించేందుకు నాలుగు నుండి ఐదు మీటర్ల లోతు వరకు పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొలగిస్తామని చెప్పారు. సరస్సు మధ్యలో ఉన్న రహదారిని విస్తరించడంతో పాటు, ప్రజలు సులభంగా దాటేందుకు వీలుగా ఒక స్కైవాక్ వంతెనను నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రగతి నగర్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న సరస్సు భాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా అభివృద్ధి చేస్తామని, దీనివల్ల సరస్సులోని నీటిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేకుండానే పనులు కొనసాగుతాయని వివరించారు. సరస్సు పరిసర ప్రాంతాలను పూర్తిగా మార్చివేస్తామని, దీనిని ‘తమ్మిడికుంట’ సరస్సు కంటే మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్ది, స్థానిక ప్రజలకు కానుకగా అందిస్తామని ఆయన చెప్పారు.
