భూ స‌ర్వేను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి

స్ప‌ష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

hellotelugu-PonguleetiSrinivasReddy

హైద‌రాబాద్ : రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన, వివాదరహితమైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, క్షేత్రస్థాయి స్వాధీనం, రెవెన్యూ రికార్డుల మధ్య ఉన్న వ్యత్యాసాలను శాస్త్రీయంగా, పారదర్శకంగా గుర్తించాల‌న‌న్నారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు ఆస్కారం లేకుండా పక్కా భూ రికార్డులను రూపొందించడమే ఈ రీసర్వే ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రైతులే కేంద్రబిందువుగా ఉండాలని, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టి, ప్రతి దశలో వారికి పూర్తి సమాచారం అందించాలని మంత్రి సూచించారు.

భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తూ.చ. తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. రీసర్వేను సాధారణ పరిపాలనా కార్యక్రమంగా కాకుండా ప్రత్యేక లక్ష్యంగా తీసుకొని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లకు స్ప‌ష్టం చేశారు. తెలంగాణ సర్వే , సరిహద్దుల చట్టం-1923, తెలంగాణ భూ భారతి (భూమిలో హక్కుల రికార్డు) చట్టం-2025 నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు.

భూ రీసర్వే కార్యక్రమం ద్వారా కేవలం భూముల కొలతలు నిర్వహించడం మాత్రమే ప్రభుత్వ లక్ష్యం కాదని, దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం, భూముల సరిహద్దులను నిర్ధారించడం, రెవెన్యూ రికార్డులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరిచేయడం, రైతుల భూ హక్కులకు మరింత భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు.

 

Exit mobile version