హైదరాబాద్ : కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలా దోచుకుంటుందో మనందరం చూస్తున్నాం అన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో దోచుకుని దాచుకునే పరిస్థితి దాపురించిందన్నారు. వీళ్లకు తెలంగాణపై అభివృద్ధి దృష్టి లేదన్నారు. పొద్దున లేచింది మొదలు సాయంకాలం వరకు అప్పులు ఎలా తేవాలా..! ఏ రకంగా దోచుకోవాలా..! ఏ రకంగా భూములు కబ్జా చేయాలి..! అనే ఆలోచననే తప్ప ఈ రెండు పార్టీలకు వేరే ఆలోచన లేదని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
12 సంవత్సరాల నుండి 12 లక్షల కోట్లు రూపాయలు ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణను మోసం చేశాయన్నారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి అంటే సెక్రటేరియట్ లో ఆర్థిక శాఖ మంత్రి బట్టి కార్యాలయం ముందర పోలీసుల కాపలా ఉండడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్తితి ఎప్పుడూ రాలేదన్నారు. అప్పులు చేసిన వాళ్లు ఆర్థిక శాఖ ఆఫీస్ ముందర ధర్నా చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. వారి నుండి (అప్పులొల్ల) బయట పడాలంటే పోలీసులను కాపలా పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. 2014 సంవత్సరంలో మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ముందు చూపు లేకుండా ఎవరికి వారు దోచుకొని దివాలా తీయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
















