నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. జాగృతి జనం బాటలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంపు హౌస్, డెలివరీ సిస్టర్న్ ను పరిశీలించారు. ఎల్లూరు పంపు హౌస్ లో పగుళ్లు, మూడో మోటారు కొట్టుకు పోవడం, పంపు హౌస్ పూర్తిగా నీట మునగడం, రిపేర్లు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా నది మీద ప్రాజెక్ట్ లు ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ లో ఉండేవన్నారు. తెలంగాణ వచ్చాక కూడా అవి నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ లు గానే మిగిలి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత. ముందు ఈ పనులను పూర్తి చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రధానంగా కల్వకుర్తి మోటార్లను రిపేర్ చేయాలని, అదే విధంగా ఎల్లూరు పంప్ హౌస్ నిర్మాణం పూర్తి చేయాలని సర్కార్ ను డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలంలోని ఎరుకల కాలనీలో ఎరుకుల కుల సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను విన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ సాహితీవేత్త దివంగత కపిలవాయి లింగమూర్తి నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రచనలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు.. లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.














