ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్

భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం

hellotelugu-TelanganaGlobalRisingSummit2025

హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను హైద‌రాబాద్ ప‌క్క‌నే ఉన్న భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా స‌మ్మిట్ ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్, క‌న్స‌ల్టెంట్స్ తో పాటు టెక్ దిగ్గ‌జాలు హాజ‌రు కానున్నారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వ‌యంగా దేశంలోని ప్ర‌ముఖుల‌ను క‌లిసి స‌మ్మిట్ కు రావాల‌ని ఆహ్వానించారు. ముందుగా ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, అగ్ర నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల‌ను క‌లిసి స‌మ్మిట్ కు హాజ‌రు కోవాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 ను డిసెంబ‌ర్ 8, 9వ తేదీల‌లో రెండు రోజుల పాటు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యింది. స‌మ్మిట్ అనంత‌రం స‌మ్మిట్ విజ‌న్ 2047 సంద‌ర్బంగా ప‌బ్లిక్ ఎగ్జిబిష‌న్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది స‌ర్కార్. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 10 నుంచి 13వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు ప్ర‌జ‌లు సంద‌ర్శించేందుకు ఉచితంగా ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.
ఈ సంద‌ర్భంగా వివిధ శాఖ‌ల అధికారులు, డొమైన్ నిపుణుల‌తో సంభాషించేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంది. స‌మ్మిట్ లో ప్ర‌త్యేకంగా డిపార్ట్ మెంట్స్ ల వారీగా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపింది. సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, తెలంగాణ స్పూర్తి వేడుక‌ల‌ను కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది స‌ర్కార్. సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా బ‌స్సు సేవ‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొంది. ఎంజీబీఎస్, జేబీఎస్, కూక‌ట్ ప‌ల్లి, చార్మినార్, ఎల్బీ న‌గ‌ర్ నుంచి ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల దాకా ప్ర‌వేశం ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

Exit mobile version