హైదరాబాద్ : తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా ‘ఖేలో ఇండియా’ పోటీలు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బలమైన పునాదిగా నిలువనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 11 నుండి 22 వరకు రాష్ట్ర ఆతిథ్యంలో తొలిసారిగా ఈ క్రీడా మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి పోటీల ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం మొత్తం రూ. 203 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వాటాగా ఈ క్రీడల నిర్వహణ కోసం రూ. 21 కోట్లు కేటాయించిందని చెప్పారు. అందులో భాగంగా రూ. 120 కోట్ల రాష్ట్ర బడ్జెట్ తో స్టేడియాలలో ప్రపంచ స్థాయి అభివృద్ధి పనులు, అత్యాధునిక క్రీడా పరికరాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు సీఎం. రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (KIYG) 2026 నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యూహరచన చేసిందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఖేలో ఇండియా పోటీల సందర్భంగా తీసుకున్న తాత్కాలిక చర్యలకు పోకుండా శాశ్వత క్రీడా సదుపాయాలను కల్పించే ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు సీఎం. రాష్టంలో భావి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రూ. 120 కోట్లతో పలు అంతర్జాతీయ క్రీడా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అత్యాధునిక క్రీడా పరికరాలు సమకూరుస్తోందన్నారు సీఎం. దీంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రీడా సౌకర్యాలు రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగ పడనున్నాయని తెలిపారు.
డిసెంబర్ 11 న అట్టహాసంగా ఖేలో ఇండియా పోటీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు దోహద పడేలా భవిష్యత్ కు పునాది వేయడంపై దృష్టి సారించాలని సీఎం ఈ సందర్భంగా అన్నారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఏర్పాట్లలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు.


















