అమరావతి : ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో ఆహార శుద్ది రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఇందులో భాగంగా తనతో పాటు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విదేశాలలో పర్యటించడం జరిగిందన్నారు. ఆహార శుద్ధి రంగంలో అగ్రగామి కేంద్రంగా ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్ రూ. 30,000 కోట్ల పెట్టుబడులు , మూడు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుందని పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్ స్పష్టం చస్త్రశారు. న్యూఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టిజి భరత్ మీడియాతో మాట్లాడారు.
ఆహార శుద్ధి రంగం కేవలం ఉత్పత్తిపైనే కాకుండా సాంకేతికత, ఆవిష్కరణలపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార శుద్ధి పరిశ్రమ విలువ 8.1 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇందులో భారతదేశ వాటా 543 బిలియన్ డాలర్లు ఉందన్నారు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా 49 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడిందని టిజి భరత్ తెలిపారు. నమోదిత ఆహార శుద్ధి పరిశ్రమల సంఖ్యలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. చేపలు, రొయ్యలు, మిరపకాయలు, నిమ్మకాయలు, కోకో, ఆయిల్ పామ్, బొప్పాయి , గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు.
అలాగే వరి, మామిడి, అరటి, సుగంధ ద్రవ్యాలు , సముద్ర ఉత్పత్తుల ఉత్పత్తిలోనూ ప్రముఖ స్థానంలో ఉందని భరత్ వివరించారు. రాష్ట్రంలో ‘ప్లగ్-అండ్-ప్లే’ (వెంటనే కార్యకలాపాలు ప్రారంభించే వీలున్న) సదుపాయాలతో కూడిన తొమ్మిది ఫుడ్ పార్కులు, 17.20 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం , 33.52 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగి (వేర్‌హౌసింగ్) సామర్థ్యం ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా పండ్ల శుద్ధి కేంద్రాలు, రొయ్యలు , జీడిపప్పు క్లస్టర్లు, సుగంధ ద్రవ్యాల క్లస్టర్లు , ఓడరేవులను పరిశ్రమలతో అనుసంధానించే సమీకృత లాజిస్టిక్స్ కారిడార్లను కూడా రాష్ట్రం అభివృద్ధి చేసిందన్నారు. గత రెండేళ్లలో రూ. 11,800 కోట్ల విలువైన 29 భారీ ఆహార శుద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
