అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి సిగ్నేచర్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్‌లో ‘స్వయం AP’ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ లింకేజీలోనూ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ సభ్యులు ముందున్నారని తెలిపింది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలు, మార్కెట్ అనుసంధానం, ఆర్థిక వనరులు, శిక్షణ, నాణ్యత ప్రమాణాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. గ్రామం నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు మహిళలకు అండగా బలమైన వ్యవస్థ నెలకొల్పడం… అవకాశాలను గుర్తించి వ్యాపారాలుగా మలిచే కార్యాచరణ చేపట్టడం… రూ.68,585 కోట్ల రుణాలతో మహిళలకు ఆర్థిక మద్దతివ్వడం… మహిళల్లో కెపాసిటీ బిల్డింగ్, వ్యాపార నిర్వహణ కోసం ప్రముఖ సంస్థలతో శిక్షణ అందించడం… 60కి పైగా సంస్థల భాగస్వామ్యంతో సమగ్ర పారిశ్రామిక ప్రణాళిక రూపొందించడం… ఈ ఐదు ప్రధాన అంశాలతో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.
ఇప్పటికే వ్యాపారంలో విజయవంతమైన మహిళలను కొత్తగా వ్యాపారంలోకి వచ్చే మహిళలకు మెంటర్లుగా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ మహిళా వ్యాపారాలను చిన్న స్థాయి జీవనోపాధి కార్యకలాపాల నుంచి సంపద సృష్టించే సంస్థలుగా మార్చేందుకు ఇంక్యుబేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఐఐఎం విశాఖపట్నం, సెంచూరియన్ యూనివర్సిటీ వంటి సంస్థలతో కలిసి మహిళా వ్యాపారాలకు మెంటార్‌షిప్, మార్కెట్, రుణం, వనరులు, వ్యాపార నైపుణ్యాల అనుసంధానం చేస్తున్నామన్నారు. మహిళల సొంత బ్యాంకింగ్ సంస్థగా ఉన్న స్త్రీనిధి ద్వారా 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు ఇప్పటికే ఆహారం, హస్తకళలు, వస్త్రాలు తదితర రంగాల్లో 23,000కు పైగా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
