అమరావతి: పవన విద్యుత్ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉన్న సుజ్లాన్ సంస్థ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గోవిందవాడలో రూ.10వేల కోట్లతో 1325 మెగావాట్ల సామర్థ్యం గల కొత్త విండ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది. వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగావకాశాలు లభింఛనున్నాయి. ఇందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామంలో సుజ్లాన్ వారి S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ ల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మంగళవారం (25-8-2026) ప్రారంభించనున్నారు. సుజ్లాన్ సంస్థ ప్రస్తుతం 1700+ మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విండ్ భాగస్వామిగా అవతరించింది. 2030 నాటికి 5వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా సుజ్లాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
004లో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన సుజ్లాన్ ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పూరు ప్రాంతంలో రోటర్ బ్లేడ్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తూ, టాటా పవర్ వంటి ప్రముఖ సంస్థలతో కలిసి పవన విద్యుత్ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. అనంతపురంలో అతిపెద్ద బ్లేడ్ తయారీ కేంద్రంతో ఇప్పటి వరకు ₹12వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీనిద్వారా ఇప్పటికే 2,200 మంది యువతకు ఇప్పటికే ఉద్యోగాలు లభించాయి. సుజ్లాన్ సంస్థకు 70 మందికి పైగా కీలక ఖాతాదారులు ఉన్నారు. అందులో టాటా పవర్, వారీ ఫరెవర్ ఎనర్జీస్, హీలియోస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, మైత్రా వాయు ప్రైవేట్ లిమిటెడ్, ఆరెంజ్ ఉరవకొండ విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఓస్ట్రో ఆంధ్రా విండ్ ప్రైవేట్ లిమిటెడ్, రీన్యూ విండ్ ఎనర్జీ (శివపూర్) ప్రైవేట్ లిమిటెడ్, పూనావాలా ఎస్టేట్ స్టన్ అండ్ అగ్రి ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, జిందాల్ అల్యూమినియం లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ వైజాగ్, యాక్సిస్ విండ్ ఫామ్స్ (అనంతపురం) ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుజ్లాన్ సంయుక్తంగా భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఉరవకొండ, విజయవాడలో ప్రపంచ స్థాయి విండ్ ఎనర్జీ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి, 12 వేల మంది యువ నిపుణులకు శిక్షణ ఇస్తున్నాయి. ఇందులో 25 శాతం మంది మహిళా ట్రైనీలు ఉండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 20 గిగావాట్ల (GW) పవన విద్యుత్ స్థాపన మైలురాయిని దాటిన తొలి భారతీయ కంపెనీగా నిలిచిన సుజ్లాన్.
