బ్లూ ఎకానమీకి సహకారం ఇవ్వండి : సీఎం

కేంద్ర మంత్రికి చంద్ర‌బాబు నాయుడు లేఖ

hellotelugu-ChandraBabuNaidu

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయటంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్ర‌బాబు నాయుడు మరో లేఖలో కేంద్ర‌ మంత్రిని కోరారు. ఈ ఏడాది జూన్ 5 తేదీన విశాఖలో జరిగిన సీఫుడ్ ఎక్స్ పోర్ట్స్ వర్క్ షాప్ లో అమరావతిలో ఎన్ఎఫ్ డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు అమరావతిలోని నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం, శిక్షణ కేంద్రం, పార్క్, ప్రజల సందర్శనార్ధం అక్వేరియం ఏర్పాటు కోసం కేటాయించామన్నారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

2028 నాటికల్లా ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణా కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లోని అక్వా కల్చర్ రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఈక్వెడార్ నుంచి అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలకు ఎగుమతులు పెరగటంతో అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ప్రస్తుతం రొయ్యల ఫీడ్ లో ఉపయోగించే చేప పొడిని 5 శాతం ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కారణంగా దేశీయ ఫీడ్ తయారీ దారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. డిజిఎఫ్‌టి ద్వారా ఎగుమతులను నియంత్రించాలన్నారు.

Exit mobile version