హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ రంగాలలో పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రదర్శించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’కు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుడ్డిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాలు, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుత అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యం కోసం ప్రపంచ సదస్సును ఒక కీలక వేదికగా ఉపయోగించు కోవాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోందని మంత్రి అన్నారు. అందుకని సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన వారికి సూచించారు. భద్రత, పార్కింగ్, ఆతిథ్యం, కనెక్టివిటీ, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్ సరఫరా, హై-స్పీడ్ ఇంటర్నెట్, అత్యవసర వైద్య సేవలు, ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శ్రీధర్ బాబు అన్నారు.
ఆతిథ్యం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, ప్రతిభావంతుల లభ్యత, నైపుణ్యాభివృద్ధి సామర్థ్యాలను ప్రదర్శించేందుకు ఎక్స్పో జోన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా, ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని మంత్రి సూచించారు.
