ముంబై : నిన్నటి దాకా తీవ్ర విమర్శల పాలైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతిభ కలిగిన ఆటగాళ్లను పట్టించు కోవడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి చెందిన , మాజీ ఎంపీ గౌతం గంభీర్ ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. తనతో పాటు అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా తలతిక్క నిర్ణయాలు, ఎవరూ హర్షించని రీతిలో ప్రయోగాలు చేశారు. ప్రత్యేకించి ఒకే ఒక్క ఆటగాడు శుభ్ మన్ గిల్ కోసం కీలకమైన , స్టార్ క్రికెటర్లను సైతం పక్కన పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఏకంగా జట్టు ఎంపికలో పూర్తిగా ఫెవరిటిజం పని చేస్తోందంటూ ధ్వజమెత్తారు. దీంతో గత్యంతరం లేక గిల్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. తాజాగా ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఖరారు చేసింది బీసీసీఐ.
ఎవరూ ఊహించని రీతిలో జట్టుకు భారంగా మారిన శుభ్ మన్ గిల్ ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది. అంతే కాదు వైస్ కెప్టెన్ గా తిరిగి అక్షర్ పటేల్ కు ఛాన్స్ ఇచ్చింది. దీంతో పాటు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్, దేశీవాళిలో దుమ్ము రేపిన రింకూ సింగ్, సందీప్ కిషన్ ను జట్టులోకి తీసుకుంది. ఈ సందర్బంగా జట్టు ఎంపికపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫేమస్ క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. గిల్ పూర్ ఫార్మెన్స్ తాత్కాలికమేనని, అతను క్లాసికల్ ప్లేయరంటూ కితాబు ఇచ్చాడు. భవిష్యత్తులో తను తిరిగి టి20 జట్టులోకి రావడం ఖాయమని జోష్యం చెప్పాడు సన్నీ. ఆయన చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
