పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్

hellotelugu-PallaSrinivasaRao

అమరావతి : తెలుగుదేశం పార్టీ నియమావళి, సిద్ధాంతాలు, పార్టీ విధానాలకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు లేదా ఎక్కడైనా ప్రస్తావించేటప్పుడు పార్టీకి ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ నాయకులతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్ప‌ష్టం చేశారు. అయితే వ్యక్తిగత కారణాలు లేదా అనివార్య పరిస్థితుల్లో, ఉదాహరణకు నివాళులు అర్పించాల్సిన సందర్భాల్లో హాజరు కావాల్సి వస్తే, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు.

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ఇచ్చిన వివరణపై పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. పార్టీ లైన్ దాటబోమని, జాతీయ అధ్యక్షుల ఆదేశాలే తమకు శిరోధార్యమని చెప్పార‌ని, దీంతో ఆ అంశం ముగిసినట్టేనని చెప్పారు. ఇకపై ఏ నాయకుడైనా మాట్లాడే మాటలు కార్యకర్తల్లో అభద్రతా భావం లేదా గందరగోళాన్ని సృష్టించే విధంగా ఉండ కూడదన్నారు. నాయకుల వ్యాఖ్యల ప్రభావం నేరుగా క్యాడర్‌పై ఉంటుందని, అందువల్ల కార్యకర్తల్లో అయోమయం కలిగించే పరిస్థితులు రాకుండా ప్రతి నాయకుడు బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. పార్టీ ఎవరినీ ఉపేక్షించదని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

Exit mobile version