అమరావతి : వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోయాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేక ప్రాంతాల్లో అదనంగా బోర్లు వేసినా ఆశించిన ఫలితం ఉండటం లేదని కేంద్ర బృందానికి వివరించారు. అందువల్ల తాత్కాలిక నీటి సరఫరా చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకాన్ని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయడం, అనుసంధానించడం వంటి సమర్ధ నీటి నిర్వహణ పనులకు కేంద్రం సహకరించాలని కోరారు. కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పంటల బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో పరిహారం జమయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో పరిహారం అందితే తదుపరి పంటల సాగుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని వివరించారు. కరువు ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాకుండా పశుసంపద, గ్రామీణ జీవనోపాధిపై కూడా పడుతున్నందున పశుగ్రాసం, తాగునీటి సరఫరా వంటి అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను, రైతుల సమస్యలను పరిశీలించింది. రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహాయంపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే, మరోవైపు కోస్తాంధ్ర జిల్లాల్లో తుపాను కారణంగా పంటలు, ఇతర రంగాలకు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విభిన్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా స్పందించి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
