అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,472 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల అధికారులు 1,841 అత్యంత సమస్యాత్మక, 2,645 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు.
ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా పలు చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్లు వేసే పరిస్తితి లేకుండా పోయిందని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ తీయాలని, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఏపీ సర్కార్ ను.
