హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ రామకృష్ణా రావుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా జూన్ 9వ తేదీన భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. దీంతో భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. పెద్ద ఎత్తున నీళ్లు రోడ్లపైకి వచ్చాయి. ఆశించిన స్థాయిలో సహాయక చర్యలు చేపట్టక పోవడం పట్ల ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు. ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా విధులు బాధ్యతతో చేపట్టాలని స్పష్టం చేశారు. లేక పోతే చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు.
కురిసిన వర్షాల సమయంలో పేలవమైన స్పందనపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి మందలించారు.
కాగా జూన్ 1న నేను సమీక్షా సమావేశం నిర్వహించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, 9న కురిసిన వర్షాల సమయంలో అధికారులు సమర్థవంతంగా స్పందించడంలో విఫలమయ్యారని , ఎందుకని నిలదీశారు సీఎం. ప్రధాన పట్టణ ప్రాంతాలలో పురపాలక, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. అవసరమైతే తాను కూడా స్వయంగా రోడ్లపై ఉంటానని అన్నారు. వర్షాల సమయంలో అధికారులందరూ తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రదేశాలు, బ్లాక్ స్పాట్‌లు, ట్రాఫిక్ రద్దీ జోన్‌లకు సంబంధించిన డేటా ఆధారంగానే చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో లేని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు.
