అమరావతి : విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల (షార్ట్ వీడియో) పోటీని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) . ‘జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల’ నేపథ్యంలో 7 నుండి 10 తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీని ప్రకటించింది. సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ఇంధన పరిరక్షణ , సుస్థిర పద్ధతులపై అవగాహన కల్పించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పోటీని నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 14 నుండి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలకు ముందు, ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ , ఏపీఎస్ఈసీఎం సీఈఓ ఎస్. నాగ లక్ష్మి ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 7 నుండి 10 తరగతుల విద్యార్థులు ఇందులో వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా 10 మంది సభ్యులతో కూడిన బృందాలుగా పాల్గొనవచ్చు అని తెలిపారు. 30 సెకన్ల నుండి రెండు నిమిషాల నిడివి గల వీడియోలను తెలుగు, ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో సమర్పించవచ్చు అని పేర్కొన్నారు.
ఈ పోటీ ఐదు ప్రధాన అంశాలపై ఉంటుందని తెలిపారు. ‘స్మార్ట్ ఎనర్జీ ఛాయిసెస్’ (తెలివైన ఇంధన ఎంపికలు), ‘ఎనర్జీ ఇండిపెండెన్స్’ (ఇంధన స్వతంత్రత), ‘కుక్ స్మార్ట్’ (సమర్థవంతమైన వంట పద్ధతులు), ‘ఫ్యూచర్ ఎనర్జీ టెక్నాలజీస్’ (భవిష్యత్తు ఇంధన సాంకేతికతలు) , ‘ఇన్నోవేట్ ఫర్ టుమారో’ (రేపటి కోసం ఆవిష్కరణలు). ఇవి ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్వచ్ఛమైన వంట పద్ధతులు, స్మార్ట్ గ్రిడ్లు, కృత్రిమ మేధస్సు (AI), పాఠశాలల్లో ఇంధన ఆడిట్ లు, స్మార్ట్ వ్యవసాయం , గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాలపై దృష్టి సారిస్తాయి. విద్యార్థులు గరిష్ట సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రులను నాగ లక్ష్మి కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీని విజయవంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ , జిల్లా విద్యాశాఖాధికారుల సహకారాన్ని కూడా ఆమె కోరారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ. 30,000, రెండో బహుమతిగా రూ. 18,000 , మూడో బహుమతిగా రూ. 12,000 అందజేస్తారు. వీటితో పాటు, పది మందికి ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు,అందరికీ ధృవీకరణ పత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారు. డిసెంబర్ 3 లోపు https://www.apsecm.ap.gov.in/seca.html వెబ్సైట్ ద్వారా ఎంట్రీలను అప్లోడ్ చేయాలని ఆమె తెలిపారు.


















