సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

ధైర్యం, పరాక్రమం, తేజస్సుకు ప్రతీకగా సింహ వాహనసేవ

hellotelugu-MalayappaSwamy

తిరుమ‌ల : తిరుమ‌ల‌లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్ప స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళ వాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.

దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనాన్ని అధిరోహిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాశక్తికి ప్రతీకగా భావించ బడుతుంది .సింహరూప దర్శనం మనలో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, పట్టుదలను, విజయ స్ఫూర్తిని మేల్కొలుపుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుంది. యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి దివ్య దర్శనం భక్తులకు అభయం, ధైర్యం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే మహోన్నత అనుభూతిని కలిగించింది.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version