విజయవాడ : బెజవాడ లోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన శ్రీ కనకుదర్గమ్మ అమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. గత నెల సెప్టెంబర్ 24 ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ గురువారం నాటితో ముగియనున్నాయి. అమ్మ వారు 11 రోజుల పాటు వివిధ రూపాలలో అశేష భక్త బాంధవులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇవాళ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
రాజరాజేశ్వరీదేవి అమ్మ వారు భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగ మూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకు గడ, ఇంకో చేతిలో అభయ ముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దూరహంకారులను, శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంత్తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.
సమున్నతమైన దైవికశక్తికి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తిగా పురాణాలు చెబుతున్నాయి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చనలు ఆచరిస్తారు.. ఇక ఈరోజు నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం సమర్పిస్తారు భక్త బాంధవులు, భవానీ మూర్తులు.
