మాస్కో (రష్యా): మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్, ఇన్నోవేషన్ డైరెక్టర్ ఆల్బర్ట్ ఎఫిమోవ్స్ , సిటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవ్జెనియ్ చులానోవ్ , డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇలియా పుల్నర్ మంత్రి లోకేష్ బృందానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన స్బేర్ బ్యాంక్ ఎటిఎంను పరిశీలించి, పని తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత స్బేర్ సిటీ ప్రతినిధులు అక్కడి ఆర్ , డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అత్యంత విశ్వసనీయమైన ఎంటర్‌ప్రైజ్ హార్డ్‌వేర్ అప్‌టైమ్‌ను నిర్ధారించడం, అంతర్గత సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌లను అమలు చేయడం, స్థానికీకరించిన కార్పోరేట్ టెక్ ఆధునీకరణను ముందుకు నడపడంపై తాము దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆటోమేటెడ్ మౌలిక సదుపాయాలు, స్మార్ట్ పరికరాల నెట్‌వర్క్‌లు, విస్తృతమైన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ గ్రిడ్‌ల అధిక-లోడ్ డిమాండ్‌లను నిర్వహించగల వినూత్న విద్యుత్ వ్యవస్థలను అమలు చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్బేర్ సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని ప్రశంసలు కురిపించారు.















