ముల్లాన్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా ఆతిథ్య భారత జట్టును చిత్తుగా ఓడించింది దక్షిణాఫ్రికా. కటక్ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని సాధించగా రెండో మ్యాచ్ లో సూపర్ షో చేసింది సఫారీ టీం. హెడ్ కోచ్ గౌతం గంభీర్ చెత్త నిర్ణయాల కారణంగా స్టార్ క్రికెటర్లు సంజూ శాంసన్, రింకూ సింగ్ లు ఆడేందుకు దూరమయ్యారు తొలి మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది దక్షిణాఫ్రికా. ఆ టీం 51 రన్స్ భారీ తేడాతో గెలుపొందింది. క్వింటాన్ డికాక్ దుమ్ము రేపాడు. భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. మొత్తంగా సమిష్టిగా విఫలం చెందడం ఆందోళన కలిగించింది. ముల్లాన్ పూర్ మైదానంలో ముందుగా బ్యాటింగ్ కు దిగింది దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది. ఏకంగా 214 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
46 బంతులు ఆడి 90 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లలు, 7 భారీ సిక్స్ లు ఉన్నాయి. భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకాక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. తిలక్ వర్మ ఒక్కడే రాణించాడు. తను 34 బాల్స్ ఎదుర్కొని 2 ఫోర్లు 5 సిక్స్ లతో 62 రన్స్ చేశాడు. బుమ్రా దారుణంగా విఫలం కాగా వరుణ్ వక్కడే 29 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భారత జట్టు తొలి 4 ఓవర్లలోనే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది. శుభ్ మన్ గిల్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశ పరిచాడు. 5 రన్స్ మాత్రమే చేశాడు. అభిషేక్ శర్మ 17 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 21 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 21, జితేశ్ శర్మ 27 రన్స్ చేశారు.
