హైదరాబాద్ : దేశంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరాలంటే శాస్త్రీయమైన కుల గణన ఒక్కటే మార్గమని, డేటా లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని పలువురు మేధావులు స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఒబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీ యూ)లో “తెలంగాణ SEEEPC సర్వే ఫలితాలు – 2027 కుల గణన దిశ” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ఫలితాలపై లోతైన చర్చ సాగింది. 2027లో జరగబోయే కుల గణనలో ఓబీసీల ఉప వర్గీకరణ, పూర్తిస్థాయి గణాంకాల సేకరణ కోసం ఉద్యమించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.
రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్ వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుల గణన ప్రశ్నావళిలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ కేటాయించాలని తాను కోరితే, కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన సమాధానం అస్పష్టంగా, బాధ్యతా రహితంగా ఉందని మండిపడ్డారు. “ప్రభుత్వం డేటా సేకరించదు.. పోనీ ఉన్న డేటాతో రిజర్వేషన్లు పెంచమంటే ఖచ్చితమైన గణాంకాలు లేవని సాకులు చెబుతుంది. ఇది ద్వంద్వ నీతి” అని ధ్వజమెత్తారు. ఓబీసీల జనాభాకు అనుగుణంగా తక్షణమే కనీసం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 0–116 పాయింట్ల “కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్” ఒక విప్లవాత్మక మార్పు అని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ పేర్కొన్నారు. ఈ ఇండెక్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అత్యధిక స్కోరు సాధించడమే వారు అనుభవిస్తున్న లోతైన వివక్షకు నిదర్శనమని చెప్పారు. అగ్రవర్ణాల స్కోరు తక్కువగా ఉండటం వారి సామాజిక ఆధిక్యాన్ని సూచిస్తోందన్నారు. ఈ సర్వే విధానంపై మరింత పారదర్శక చర్చ జరగాలని ఆకాంక్షించారు. మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, డా. సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సర్వేలో కొన్ని ఓబీసీ కులాల జనాభాను తక్కువగా, మరికొన్ని వర్గాల జనాభాను ఎక్కువగా చూపారనే విమర్శలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయి కుల గణనకు ఇది ఒక పద్ధతి శాస్త్రీయ పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
















