తిరుమలలో వైభవంగా పుష్పాలు ఊరేగింపు

పుణ్య‌క్షేత్రంలో ఘ‌నంగా పుష్ప యాగం

hellotelugu-Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని అంగ‌రంగ వైభ‌వోపేతంగా పుష్ప యాగం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాడ వీధుల‌లో పుష్పాల ఊరేగింపు ఆక‌ట్టుకుంది. భ‌క్తుల‌ను అల‌రించింది. తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ , టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఉద్యాన‌వ‌న సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ ,ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్ప యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచి పోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు.

శ్రీవారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు శోభాయమానంగా పుష్ప యాగం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు ఈవో. ఇందు కోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగించామ‌ని తెలిపారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.

Exit mobile version