చిన్న సినిమాల‌ను చిదిమేస్తున్నారు : షెరాజ్ మెహ‌దీ

ఫిల్మ్ చాంబర్ స్పందించ‌డం లేద‌ని సంచ‌ల‌న కామెంట్స్

hellotelugu-SherajMehadi

హైదరాబాద్ : ద‌ర్శ‌కుడు, న‌టుడు షెరాజ్ మెహ‌దీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాను రాను చిన్న సినిమాలు బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోతోంద‌ని ఆవేద‌న చెందారు. ప‌నిగ‌ట్టుకుని వాటిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. ప్ర‌త్యేకించి తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండ‌స్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ విడుదల, రీ-రిలీజ్ సమయంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్ర‌మే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాత‌ల‌కు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పని చేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్ట పోతున్నాయని తెలిపారు.

హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరక ముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్‌ఫార్ములు, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గి పోతున్నాయని వాపోయారు షెరాజ్ మెహ‌దీ.

‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని ప్రివ్యూ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చెప్పార‌న్నారు. అంత హిట్ సినిమాను కూడా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రానివ్వ‌డం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. భరత్ భూషణ్ త‌మ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.

Exit mobile version