మూడు రోజుల్లో పూడికను తొలగించాలి : క‌మిష‌న‌ర్

షేక్‌పేట డ్రైన్‌ను పరిశీలించిన ఏవీ రంగ‌నాథ్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ఓ వైపు రాష్ట్ర హైకోర్టు త‌న ప‌నితీరు, నిర్వాకం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆపై వెంట‌నే త‌న‌ను బ‌దిలీ చేయాల‌ని ఆదేశించింది రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజును. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా త‌నపై హైకోర్టు సీరియ‌స్ అయిన‌ప్ప‌టికీ హైడ్రా క‌మిష‌న‌ర్ మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా షేక్‌పేటలోని హకీంషా విరాట్‌నగర్‌లో ఉన్న వరద నీటి కాలువను (డ్రైన్‌ను) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ భారీగా పేరుకు పోయిన వ్యర్థాలకు గల కారణాలపై ఆయన స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మీడియాలో వచ్చిన కథనాలు, స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ స్వయంగా కాలువను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు.

పై ప్రాంతాల నుండి భారీగా కొట్టుకొచ్చే చెత్తతో పాటు, ప్రజలు ఇష్టానుసారంగా కాలువలో వ్యర్థాలను పారవే యడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని హైడ్రా ఆర్ఎఫ్ ఓ జ‌య‌ప్ర‌కాష్‌, ఎస్ఎఫ్ ఓ చరణ్ కమిషనర్‌కు వివరించారు. షేక్‌పేట ఓయు కాలనీ, మారుతినగర్, వివేకానందనగర్, అంబేద్కర్ నగర్, ఎంజీ నగర్, హకీంషా విరాట్‌నగర్, బృందావన్ కాలనీల మీదుగా వెళ్లే ఈ వరద నీటి కాలువ వెంబడి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను పారవేసే వారిపై చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడవద్దని ఆయన హెచ్చ‌రించారు. ఆయన స్థానికులతో కూడా మాట్లాడారు. వ్యర్థాల పారవేతను అరికట్టడంలో ఆయా కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా, వరద నీటి కాలువలోకి జేసీబీలను పంపి, రెండు మూడు రోజుల్లోనే మొత్తం వ్యర్థాలను తొలగించాలని అన్నారు.

Exit mobile version