న్యూఢిల్లీ : మూడు శిశు పోషకాహార ఉత్పత్తులలో ఆహార భద్రతా నిబంధనలను పాటించ లేదన్న ఆరోపణలపై నెస్లే ఇండియా లిమిటెడ్‌పై చట్ట పరమైన చర్యలు ప్రారంభించినట్లు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) శుక్రవారం వెల్లడించింది అధికారికంగా శిశువులకు ఇచ్చే అనుబంధ ఆహారంతో పాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న వాటి ప్రచార సామగ్రిని తాము పరిశీలించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వే ప్రోటీన్ కు సంబంధించిన వాదనలను, అలాగే లాక్టోగన్ ప్రో విషయంలో సులభంగా జీర్ణమవుతుందన్న వాదనను నియంత్రణ సంస్థ గుర్తించింది. ఈ వాదనలపై నెస్లే ఇండియా నుండి వివరణ కోరినట్లు సంస్థ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. శిశు ఆహారాల అమ్మకాలను పెంచే లక్ష్యంతో చేసే ప్రచార వాదనలు లేదా సామగ్రిని నియంత్రించే ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (శిశు పోషకాహారం) నిబంధనలు, 2020’లోని నిబంధన 4(2)ను వర్తింప చేసింది.
అలాగే అటువంటి ఉత్పత్తుల ప్రకటనలు లేదా ప్రచారాన్ని నిషేధించే ‘శిశు పాల ప్రత్యామ్నాయాలు ఫీడింగ్ బాటిల్స్ , శిశు ఆహారాల ఉత్పత్తి, సరఫరా , పంపిణీ నియంత్రణ చట్టం, 1992’లోని సెక్షన్ 3ని ఈ రెండు ఉత్పత్తులు ఉల్లంఘించినట్లు తేలిందని పేర్కొంది. మరోవైపు, నెస్లే ఇండియా తయారు చేసిన ‘ఫాలో-అప్ ఫార్ములా’ నమూనాను ప్రయోగశాల విశ్లేషణకు పంపగా, అందులో ‘బయోటిన్’ మోతాదు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలిందని స్పష్టం చేసింది ఎఫ్ ఎస్ఎస్ఏఐ. ఆ నమూనాను తిరిగి విశ్లేషణకు పంపగా, ‘రిఫరల్ లాబొరేటరీ’ కూడా 2020 నిబంధనల ప్రకారం ఉండాల్సిన బయోటిన్ స్థాయిలు ఇందులో లేవని నిర్ధారించింది. ఈ ఫలితాల ఆధారంగా ఆ మూడు ఉత్పత్తులకు సంబంధించి నెస్లే ఇండియాపై మూడు వేర్వేరు విచారణ (అడ్జుడికేషన్) కేసులను నమోదు చేసినట్లు తెలిపింది.
