ముంబై : టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌కు ఐదేళ్ల పొడిగింపును టాటా సన్స్ బోర్డు ఆమోదించింది. తన ప్రస్తుత పదవీ కాలం పూర్తయిన తర్వాత తాను పునఃని యామకం కోరబోనని చంద్రశేఖరన్ సూచించిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది. గురువారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, ప్రస్తుతం తన రెండవ ఐదేళ్ల పదవీ కాలంలో ఉన్నారు, ఇది ఫిబ్రవరి 2027లో ముగియనుంది. ఈ తాజా నిర్ణయం ఆయనను మరో ఐదేళ్లపాటు టాటా గ్రూప్ సారథ్యంలో కొనసాగేందుకు అనుమతిస్తుంది. తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి ఉండాలని అనుకోవడం లేదంటూ సుదీర్ఘమైన లేఖ రాశారు చంద్రశేఖరన్.
వ్యాపార, నియంత్రణ పరమైన పరిణామాల కీలక దశను ఎదుర్కొంటున్న టాటా గ్రూప్‌లో బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం, గతంలో తీసుకున్న వైఖరికి విరుద్ధంగా ఉందని, అగ్రస్థానంలో కొనసాగింపును అందిస్తుందని వర్గాలు తెలిపాయి. ఉన్నత శ్రేణి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హోదాకు సంబంధించిన నియంత్రణ పరమైన పరిణామాల నేపథ్యంలో, హోల్డింగ్ కంపెనీ భవిష్యత్ నిర్మాణం, లిస్టింగ్ గురించి కూడా టాటా సన్స్ బోర్డు చర్చిస్తోంది. కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా తన రిజిస్ట్రేషన్‌ను వదులు కోవాలన్న టాటా సన్స్ అభ్యర్థనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో తిరస్కరించింది. దీంతో గ్రూప్ హోల్డింగ్ కంపెనీ వర్తించే లిస్టింగ్ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. టాటా గ్రూప్ తన దీర్ఘకాలిక పాలన, కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షిస్తున్న నేపథ్యంలో, ఈ తరుణంలోనే చంద్రశేఖరన్ పదవీకాలంపై నిర్ణయం వెలువడింది.
రతన్ టాటా తర్వాత, చంద్రశేఖరన్ ఫిబ్రవరి 2017లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు, ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో, టాటా గ్రూప్ టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఏవియేషన్, స్టీల్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ , ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో సహా పలు రంగాలలో తన ఉనికిని విస్తరించింది.
