సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలి : సీఎం

అపరిశుభ్రతే అసలు జబ్బు ప్రజల్లో చైతన్యం పెంచాలి

hellotelugu-APCM

అమ‌రావ‌తి : స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్‌పై పరిశీలన జరిపామని… స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు వివరించారు.

ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని…వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిస్సాలలో 7 వేలు చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ…..స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version