500 చిత్రాల స్క్రిప్టులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్

hellotelugu-CBFC

హైద‌రాబాద్ : ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ లో తీవ్ర భద్రతా లోపం బయట పడింది. 500కు పైగా చలన చిత్రాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ధృవీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో సినీ వర్గాల్లో పెద్ద కలకలం రేగింది. నిర్మాతలు తమ చిత్రాలకు సెన్సార్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే ‘ఈ-సినీ ప్రమాణ్’ అనే అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ నుండే ఈ సమాచారం లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన సెన్సార్ బోర్డు పనితీరు, డిజిటల్ భద్రతా ప్రమాణాల పట్ల తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. లీక్ అయిన సమాచారంలో పూర్తి స్థాయి చిత్రాలు లేనప్పటికీ, వాటికి సంబంధించిన అత్యంత సున్నితమైన పత్రాలు ఉన్నాయి. వీటిలో చిత్రాల షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ బోర్డు సూచించిన కట్‌ల వివరాలు (కట్ ఆర్డర్లు) , థియేటర్లలో విడుదల కోసం సమర్పించిన ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు సమాచారం. ఒక సినిమా కథ, పాత్రల వివరాలు , తొలగించిన సన్నివేశాలు ముందే బయటకు రావడం వల్ల, నిర్మాతలకు ఆర్థికంగా , సృజనాత్మక పరంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఈ కీలక పత్రాలన్నీ ‘ఇంటర్నెట్ ఆర్కైవ్’ అనే వెబ్‌సైట్‌లో కొన్ని రోజుల పాటు డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. విషయం వెలుగులోకి రాగానే ఇంటర్నెట్ ఆర్కైవ్ యాజమాన్యం వెంటనే స్పందించి, ఆ సమాచారాన్ని తమ ప్లాట్‌ఫారమ్ నుండి పూర్తిగా తొలగించింది. అంతేకాకుండా, ఈ విషయాన్ని సైబర్ భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వారు ధృవీకరించారు. ఈ డేటా లీక్ ఘటనపై సెన్సార్ బోర్డు స్పందించింది. తమ పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, పోర్టల్‌కు సంబంధించి పూర్తి స్థాయి భద్రతా ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏ నిర్మాత ఖాతా కూడా హ్యాక్ కాలేదని ప్రాథమిక విచారణలో తేలిందని సీబీఎఫ్‌సీ స్పష్టం చేసింది. విచారణ పూర్తయిన తర్వాతే, ఈ భద్రతా వైఫల్యానికి అసలు కారణాలు ఏమిటి , ఎంతవరకు నష్టం జరిగిందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది.

Exit mobile version