హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు విక్టరీ వెంకటేశ్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన తాజాగా చాన్నాళ్ల తర్వాత వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం తీశాడు. ఎంత గొప్ప ఫోటో అయినా లేదా పెయింటింగ్ అయినా అది తగిలించడానికి ఒక గోడ కావాలి. ఈ సినిమా ఇంత గొప్పగా తీర్చిదిద్దబడటానికి తమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక గోడలాగా నిలబడ్డాడు. ఇవాళ పొద్దున్నే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్ చేశాం. నా గ్రాటిట్యూడ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక.. తమన్ మాట్లాడున్న సమయంలో వచ్చి వెనక నిల్చున్నాను. నాకు అతని లాగా సంగీతంతో మాట్లాడటం రాదు. కాబట్టి నా స్పర్శతోనే అతనితో మాట్లాడే ప్రయత్నం చేసి, అతని భుజం మీద చెయ్యేశాను. రచయితగా నా ప్రయాణాన్ని వెంకటేష్ పవిత్ర బంధం సినిమాతోనే మొదలు పెట్టాను. ఓ రకంగా ఆయన నాతో ఓనమాలు దిద్దించారు. పెళ్ళి చేసుకుందాం సినిమా సమయంలో నేను ఎవరో తెలియక పోయినా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ‘నువ్వు నాకు నచ్చావ్’ కథ చెప్పినప్పుడు, అసలు నా మీద ఏ నమ్మకం ఉందో తెలియదు.. నేను కథ చెప్పడం పూర్తయిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం,
ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దని రవికిశోర్ కి, విజయ భాస్కర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటి నుంచి నా కెరీర్ వేరే టర్న్ తీసుకుంది. అందుకే నేను వెంకటేష్ కి ఎప్పుడు కృతజ్ఞుడినై ఉంటాను. అదే సపోర్ట్ ఇప్పటికీ ఉంది. తాము బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే ప్రతిరోజూ సాయంత్రం మాతో నాలుగైదు గంటలు కూర్చొని నాకు, తమన్ కి ఎంతో హుషారు ఇచ్చారు. ఆయన ఉన్నారనే హుషారుతో తమన్ ఇంకా చెలరేగి పోయాడు అనిపించింది నాకు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క భాగం పంచుకున్నారు. కుటుంబంలో ప్రతివారికి గది ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఒక పార్టు ఉంది. ఇంటర్వెల్ లో కెవిన్ మాస్టర్ తాలూకు విశ్వరూపం చూస్తారు. ఆయన ఒక ఫైట్ ని కొరియోగ్రాఫ్ చేయలేదు, ఒక సీన్ ని డైరెక్ట్ చేశాడు. పాటలకి కొరియోగ్రాఫర్ అంటే ఆ మూడు రోజులో నాలుగు రోజులో వచ్చి వెళ్ళిపోతారు.
కానీ, భాను మాస్టర్ అలా కాదు. మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పటి నుంచే మాతో టైం స్పెండ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అంటే మా కుటుంబం లాగా. సీతారామశాస్త్రి సమయం నుంచే మాకు పరిచయం. శ్రీనిధి శెట్టి కథ వినగానే ఓకే చెప్పింది. నివేదా పేతురాజ్ మా కుటుంబం లాగా. అందుకే కథ కూడా వినకుండా ఓకే చెప్పేసింది. సెట్ లో సత్య నటనను చూసి మేమెంత ఎంజాయ్ చేశామో.. థియేటర్లలో మీరు అంత ఎంజాయ్ చేస్తారు. కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. మనం సెలెక్ట్ చేసుకోము. ఏ అమ్మానాన్నకి పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి అది మన చేతుల్లో ఉండదు. కావున కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. బంధాలన్నీ మనకి ఇవ్వబడతాయి. కానీ స్నేహితులను మనం ఎంచుకుంటాం. ప్రేమ కోసమైతే కోరుకుంటాం, వెంటపడతాం, ప్రాణాలు తీసుకునే అంతగా ప్రయత్నిస్తాం, యుద్ధం కూడా చేస్తాం. కుటుంబం మనకి ఇవ్వబడుతుంది.
స్నేహితులను మనం ఎంచుకుంటాం. ప్రేమ మనం కోరుకుంటాం. అలా ఒక ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడు కోవడానికి నలుగురు మనుషులు. చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు మనుషులు ఆ కుటుంబాన్ని కాపాడు కోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎంత దూరం వెళ్ళారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా తాలూకు కథ. ఇంకో మాటలో చెప్పాలంటే.. కృష్ణుడు గీత రెండుసార్లు చెప్పాడు. మొదటిది అర్జునుడికి కురుక్షేత్రం సమయంలో.. అది భగవద్గీత. రెండోవది యాదవుల్లో ముసలం పుట్టి, యమునా నది దగ్గర ఒకరినొకరు చంపుకుంటుంటే.. అతను నాకు వీళ్ళతో సంబంధం లేదని చెప్పి, తన కుటుంబం తన కళ్ళ ముందే చనిపోతుంటే, నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే.. ఉద్ధవుడు అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పిన గీతను ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవ గీతలో రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారు? వాళ్ళ తాలూకు మనస్తత్వాలు ఎలా ఉంటాయి? చెప్పాడు.
మనుషుల్లో ఆశ, కోరిక, కలహ ప్రియత్వం ఈ మూడూ ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచంలో మనుషులు అలాగే ఉన్నారు. ప్రపంచ ఇలా ఉంటుందని దాదాపు 5000 సంవత్సరాల క్రితమే ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమాజంలో కుటుంబం మాత్రమే మనకి ఇంకా తోడుగా ఉంది. అది కూడా ముక్కలైపోతే మనుషులు దేనికోసం బతకాలి. మనుషులు బతకడానికి ఒక పర్పస్ అయితే ఉండదు. అందుకే నేను కుటుంబ బంధాలను గానీ, కుటుంబ విలువలను గానీ అంతలా ఇష్టపడతాను. వాటి గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని బావుల్లోనుంచి ఎంత నీరు తోడినా ఆ నీరు పూర్తవదు. ఎందుకంటే ఆ బావి ఎండిపోదు. కుటుంబం కూడా అలాంటి బావి. చాలా లోతైనది, చాలా తియ్యనైనది. మన దాహాన్ని, మన ఆర్తిని తీరుస్తుంది. అలాంటి కుటుంబాలు, వాటిని ఆనందింపజేసే విషయాలు, వాటిని ఉత్తేజపరిచే విషయాలు, వాటిని భయపెట్టే విషయాలు, వాళ్ళ తాలూకు సమస్యలు, వాటి పరిష్కారాలు.. ఇవన్నీ చెప్పడానికి సరైన మనిషి ఎవరున్నారు వెంకటేష్ తప్ప. కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన హీరో వెంకటేష్ . ‘ప్రపంచమొక పద్మవ్యూహం – కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కుటుంబం ఒక పద్మవ్యూహం.. అందులోకి అభిమన్యుడి లాగా వెళ్ళి, బయటకు రావడం తెలియక చనిపోతారా? అర్జునుడిలాగా వెళ్ళి గెలిచి విక్టోరియస్ గా బయటకు వస్తారా? అనేదే ఈ సినిమా మనకి చెప్తుంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని తెలిపాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
