చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు . నీట్ యుజి 2026 పరీక్ష లీక్ పై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నీట్ వ్యవహారంపై సీఎం స్పందించారు. నీట్ పరీక్షను రద్దు చేయడం తప్పితే మరో మార్గం లేదన్నారు. సమస్య మరింత జఠిలం కాకముందే కేంద్రం మేల్కోవాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, నీట్ యుజి ఎగ్జామ్ ను పూర్తిగా రద్దు చేయడమే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు విజయ్.
ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా పలువురు నిరసనకారులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి వైఖరిని ప్రదర్శించారు. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హత , ప్రవేశ పరీక్ష అయిన నీట్ ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పిలుపునిచ్చారు. ప్రజలు, విద్యార్థుల మనోభావాలను పాలకులు గౌరవించాలని ఆయన అన్నారు. విద్య అనే అంశాన్ని ‘ఉమ్మడి జాబితా’ నుండి తొలగించి ‘రాష్ట్ర జాబితా’ లో చేర్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.
ఆయన ఒక ఘాటైన ప్రకటన చేశారు. న్యూఢిల్లీలో పార్లమెంటు వెలుపల కొనసాగుతున్న భారీ నిరసనలకు తన పార్టీ మద్దతును ప్రకటించారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. నీట్ విషయంలో తన పార్టీ వైఖరిలో ఎటువంటి రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ సమయంలోనే, ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దీనిపై తమ వైఖరిని స్పష్టంగా తెలియ జేశామని విజయ్ గుర్తుచేశారు. విద్యార్థుల నిరసనలు, నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల కారణంగా ఏర్పడిన ప్రస్తుత ప్రతిష్టంభనకు నీట్ ని పూర్తిగా రద్దు చేయడమే ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. ఒకవేళ ఇందులో ఏవైనా చట్టపరమైన అడ్డంకులు ఉంటే, ఒక ప్రత్యేక ‘ఉమ్మడి జాబితా’ను సృష్టించి, విద్యను దాని పరిధిలోకి తీసుకు రావచ్చని విజయ్ సూచించారు.
