హైదరాబాద్ : తెలంగాణ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. పోలింగ్ ప్రక్రియ మార్చి 2027 నాటికి జరిగే అవకాశం కనిపిస్తోంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగ ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. భారత ఎన్నికల సంఘం తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాలకుమహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ—ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేయనుంది. పోలింగ్ ఫిబ్రవరి లేదా మార్చి 2027లో జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు సురభి వాణీ దేవి , చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) ల పదవీకాలం మార్చి నెలతో ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, తాము పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేసేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు.
మొదటి దశ ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియగా మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 5,77,182 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 1,12,954 దరఖాస్తులు ఇప్పటికే ఆమోదం పొందగా, 4,41,006 దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయి; 2,780 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 2021లో ఈ నియోజకవర్గంలో మొత్తం 5,31,268 మంది ఓటర్లు ఉండగ వారిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది మహిళలు , 68 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో పట్టభద్రుల నుండి మొత్తం 6,52,680 దరఖాస్తులు అందాయి. వీటిలో 2,30,906 దరఖాస్తులు ఆమోదం పొందగా, 3,93,169 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉన్నాయి . 11,746 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 2021లో, మొత్తం 5,05,565 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు; వీరిలో 3,32,634 మంది పురుషులు, 1,72,864 మంది మహిళలు మరియు 67 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
డిసెంబర్ 10 నుండి తదుపరి దశ నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఓటర్ల సంఖ్య మరో రెండు లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసే వరకు సమయం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తోంది. దీని కోసం నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులను CEO వెబ్సైట్ (https://ceotelangana.nic.in) ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు.



















