SBI : దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సైనిక సేవలో ఉన్న అగ్నివీరులకు ఓ ప్రత్యేకమైన ఆర్థిక లబ్ధిని ప్రకటించింది. ప్రస్తుతం అగ్నిపథ్ పథకం కింద దేశ రక్షణలో కొనసాగుతున్న అగ్నివీరులు ఇకపై ఎలాంటి హామీ లేకుండా రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందగలిగే అవకాశం కల్పించినట్టు ఎస్‌బీఐ (SBI) వెల్లడించింది. ఈ ప్రకటనతో దేశ సేవలో ఉన్న యువతకు ఆర్థికంగా సహకరించాలనే దిశగా మరో ముందడుగు వేసినట్టు అయింది.
SBI – ఎలాంటి హామీ, పుచ్చికత్తు లేకుండానే రుణం
ఈ పథకంలోని విశేషత ఏమిటంటే, అగ్నివీరులు ఈ రుణాన్ని పొందడానికి ఏమైనా ఆస్తిని హామీగా పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, సాధారణంగా బ్యాంకులు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా మాఫీ చేశారు. దీంతో రుణం పొందడంలో ఎటువంటి అదనపు ఖర్చులు పడకుండా అగ్నివీరులు లాభపడేలా ఈ విధానం రూపొందించబడింది.
జీత ఖాతా ఉన్నవారికి మాత్రమే అవకాశం
ఈ ప్రత్యేక రుణ సౌకర్యం ఎస్‌బీఐలో జీత ఖాతా కలిగిన అగ్నివీరులకే వర్తిస్తుంది. బ్యాంకు వద్ద ఇప్పటికే వారి ఆదాయం, సేవా వివరాలు ఉండడం వల్ల, రుణ ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తి చేయగలగడం మరో ప్రయోజనం.
సులభమైన తిరిగి చెల్లింపు విధానం
అగ్నివీరులు తమ సైనిక సేవా కాలంలోనే ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సేవ పూర్తయిన తర్వాత వారికి ఆర్థిక భారంగా మారదు. ఆస్తి భరోసా లేకుండా, సేవ కాలంలోనే చెల్లింపు పద్ధతి ఉండడం వల్ల ఇది చాలా అనుకూలంగా మారుతుంది.
రక్షణ సిబ్బందికి తక్కువ వడ్డీ రేటు
అగ్నివీరులతోపాటు అన్ని రక్షణ సిబ్బందికీ ఎస్‌బీఐ (SBI) 2025 సెప్టెంబర్ 30 వరకు వ్యక్తిగత రుణాలపై 10.50% వడ్డీ రేటును అందిస్తోంది. సాధారణంగా ఈ రేటు కంటే ఎక్కువ ఉండే పరిస్థితుల్లో, ఇది రక్షణ సిబ్బందికి ఊరట కలిగించేదిగా ఉంది.
“మన అగ్నివీరులకు ఎస్‌బీఐ పూర్తిగా అండగా ఉంటుంది” – ఎస్‌బీఐ ఛైర్మన్
ఈ సందర్భంగా ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి మాట్లాడుతూ, “దేశ రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే యువత తమ భవిష్యత్తును నిర్మించుకోవడంలో మేము సంపూర్ణ మద్దతు అందిస్తాము. ఈ రుణ పథకం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అగ్నివీరుల కోసం మరిన్ని సహాయక చర్యలు తీసుకురావడమే మా లక్ష్యం” అని తెలిపారు.
Also Read : India Credit Rating Growth : భారత్ రేటింగ్ పై ట్రంప్ గూబ గుయ్యమనిపించే అప్డేట్
