హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆకాశంలో ఒక తార మూవీలో కొత్తగా ఆరంగ్రేటం చేసిన తెలుగు అమ్మాయి , అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసి నటించిన సాత్విక వీరవల్లిపై ప్రశంసలు కురిపించాడు. అలనాటి శ్రీదేవి, జయసుధ తర్వాత అంత గొప్ప నటి అవుతుందన్నారు. త్వరగా తెలుగు భాష నేర్చుకోవాలని నటికి సూచించాడు దర్శకుడు. సాత్విక వీరవల్లికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా పరిచయమైన సాత్విక వీరవల్లి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రం ఆమెకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఈ సినిమా సక్సెస్ వేడుకల్లో పాల్గొన్నారు ఎస్.ఎస్. రాజమౌళి. సాత్విక వీరవల్లి గురించి మాట్లాడుతూ.. ఆమె భవిష్యత్తులో ఒక ప్రముఖ తెలుగు నటిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులు ఏ భాషకు లేదా ఏ ప్రాంతానికి చెందిన నటీమణులనైనా ఆదరిస్తారు. కానీ, మన మనసులో ఎప్పుడూ ఒక తెలుగు అమ్మాయి గొప్ప స్టార్‌గా ఎదగాలని కోరుకుంటాం. గతంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి నటీమణులు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అటువంటి స్థాయికి మరో తెలుగు నటి చేరుకోవాలని మనం ఎప్పుడూ ఆశిస్తుంటాం. ఇప్పుడు సాత్విక వీరవల్లి వచ్చింది అని అన్నారు.ఈ మాటలతో సాత్విక అందరి దృష్టిలో పడ్డారు.
