ఆస్కార్‌ బరిలో తెలుగు అమ్మాయిల షార్ట్ ఫిలిం

మ‌రో రెండు చిత్రాలు గోంథ‌ల్, అంగ్ కూడా బ‌రిలో

hellotelugu-PankajaOscar

హైద‌రాబాద్ : ఆస్కార్‌ పురస్కారాలకు సంబంధించి భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో పరిశీలనకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే మరో లఘు చిత్రం కూడా ఆస్కార్‌ అకాడమీ పరిశీలనకు అర్హత సాధించింది. అదే కన్నడ-తెలుగు లఘు చిత్రం ‘పంకజ’ . దర్శకురాలు అనూయ స్వామితో పాటు ప్రధాన పాత్రలో నటించిన హర్షిణి బోయళ్ల కూడా తెలుగువారే కావడం విశేషం. వారిద్దరూ బెంగళూరులో పుట్టి పెరిగారు. బెంగళూరులోని ఓ మురికివాడలో నివసించే కుటుంబాల నేపథ్యంలో ‘పంకజ’ను తెరకెక్కించారు. పంకజ అనే మహిళ.. కనిపించకుండా పోయిన తన భర్తను కుమార్తెతో కలసి వెతికే క్రమంలో ఎదురైన అనుభవాలే ఈ చిత్ర కథాంశం.

అధికారం ఉన్న వ్యక్తులు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని సామాన్యులను ఎలా హింసిస్తున్నారన్న విషయాన్ని ఇందులో ప్ర‌ధానంగా చర్చించారు. ఈ లఘు చిత్రం ప్రతిష్ఠాత్మక సన్ డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ సహా 40కిపైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. రెయిన్ డ్యాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో విజేతగా నిలవడం ద్వారా ఆస్కార్‌ పరిశీలనకు అర్హత సాధించింది. న్యూయార్క్‌ యూనివర్శిటీలో అనూయ మీడియా ఆర్ట్స్‌ కోర్సు చేస్తున్నప్పుడు, రెండో ఏడాది స్టూడెంట్‌ ప్రాజెక్టుగా ‘పంకజ’ను తెరకెక్కించారు. ఇప్పుడు అదే ఆస్కార్‌ పరిశీలనకు ఎంపికవడం విశేషం. ఈ నేపథ్యంల ఈ లఘు చిత్రానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి హాలీవుడ్‌ నటులు స్పైక్‌ లీ, విలియం డఫో, భారత్‌కు చెందిన ఆస్కార్‌ విజేత గునీత్‌ మోంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు.

Exit mobile version