ఆప్కో , లేపాక్షి ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు పెంచాలి

6న పెనుకొండలో ఆప్కో షో రూమ్ ఏర్పాటు

hellotelugu-APCO

 

అమరావతి : చేనేతలకు ఆర్థిక మేలు కలిగించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఇందులో భాగంగా పెట్టుబడిగా నూలు అందజేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. దీనివల్ల నేతన్నలపై పెట్టుబడి భారం పడుకుండా ఉంటుందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, 10 రోజుల్లోగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆర్థిక సాయం అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో చేనేత ఉత్పత్తులు, హస్త కళారూపాల అమ్మకాలు పెంచాలని, రానున్న పండగల నేపథ్యంలో డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరించారు.

మంత్రి సవిత మాట్లాడుతూ చేనేత, హస్త కళకారులు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. చేనేతలకు ఆర్థిక మేలు కలుగజేసేలా ఇప్పటికే పలు పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేసేలా నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం అమలులో భాగంగా తొలి విడతగా 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. అర్హులైన మరింత మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించగా, 36,632 మంది అప్లయ్ చేసుకున్నారన్నారు. రాబోయే పది రోజుల్లో వారిలో అర్హులను గుర్తించి, వీలైనంత తొందరగా రెండో విడత నేతన్నల సేవలో పథకం ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలని చేనేత, జౌళి శాఖాధికారులను ఆదేశించారు.

Exit mobile version