అమరావతి : ఆరు నూరైనా , ఎన్ని అవాంతరాలు వచ్చిన సరే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సాకారం కావడానికి ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేసేలా కృషి చేశామన్నారు. ప్రతి సోమవారాన్ని పోల వారంగా మార్చుకుని 2019 వరకు 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసిందన్నారు. డయాఫ్రాం వాల్ కొట్టుకు పోయిందని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ద్వారా ప్రజలే పోలవరానికి శాప విముక్తి కల్పించారని అన్నారు. రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తామే చేశామంటూ గొడ్డలి పార్టీ పేక్ ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ ప్రాజెక్టులు తామే కట్టామని చెప్పుకుంటోందని అన్నారు.
ప్రజలు ఛీ కొట్టినా ఆ పార్టీకి సిగ్గు రావటం లేదన్నారు. అనకాపల్లికి నీరు కూడా తామే చేశామని చెప్పుకుంటారని పోలవరం పూర్తి అయితే మా గొప్పే అంటారంటూ ఎద్దేవా చేశారు. నేర చరిత్ర ఉన్న గొడ్డలి పార్టీది విధ్వంసమే అసలు నైజమని అన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకు రావడం అంత సులభంగా జరగలేదని, గంటలు, రోజుల వారీగా లక్ష్యాలు పెట్టుకుని పనులు పరుగులు పెట్టించామని చెప్పారు. ఎడమ ప్రధాన కాలువను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం చేస్తామన్నారు. రూ.3,200 కోట్లతో ఉత్తరాంధ్రలోని 12 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో సాగునీటి రంగంలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గోదావరి- కృష్ణా సహా రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జల హారతి ఇస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు అనే నేను 2015 సెప్టెంబరు 16న పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తీసుకెళ్ళానని..2017 ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతలను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు అనే నేను 2026 సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకువచ్చానని ముఖ్యమంత్రి అన్నారు. తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ సాగునీటి ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కోసమే పనిచేశానని వివరించారు.
