శ్రీ భోగ శ్రీనివాస‌మూర్తికి స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం

తిరుమ‌ల ఆల‌యంలో ఘ‌నంగా కార్య‌క్ర‌మం

hellotelugu-Kalasabhishekam

తిరుమల : శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం అంగ‌రంగ వైభ‌వోపేతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు.

శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళ పెరుమాళ్(శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ను, ఆయన కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనుల వారిని ఉంచారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు. అన‌గా శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి నిర్వ‌హించే అభిషేకాధి క్ర‌తువులు మూల‌మూర్తికి నిర్వ‌హించిన‌ట్లు అవుతుంది. అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ప్ర‌త్యేక సహస్ర కలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రో వైపు తిరుమ‌ల పుణ్య‌క్షేత్రానికి భ‌క్తుల ర‌ద్దీ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వేస‌వి సెల‌వులు అయి పోయినా, బ‌డులు, క‌ళాశాల‌లు, విద్యా సంస్థ‌లు తిరిగి తెరిచినా భ‌క్తుల రాక త‌గ్గ‌డం లేదు. దీంతో టీటీడీ భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Exit mobile version