వైఎస్సార్ కడప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం భూమయ్యగారి పల్లెలో గట్టు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా తన ప్రభుత్వ హయాంలో రూ. 1.20 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. ఈ ఆలయాన్ని పునర్ నిర్మించేందుకు వీటిని మంజూరు చేశారు. ఇవాళ నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు జగన్ రెడ్డి.
ఇదిలా ఉండగా ఆలయానికి చేరుకున్న వైయస్ జగన్‌కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ జగన్, స్వామి వారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గట్టు శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దీవెనలు రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు
ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లిన వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో శ్రీరామిరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీరామిరెడ్డి పార్టీ కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన మరణం వైఎస్సార్‌సీపీకి తీరని లోటని పేర్కొన్నారు.
