హైదరాబాద్ : తమ న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సర్కార్ విఫలం అయ్యిందని ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడ్డారు. గత సర్కార్ ను గద్దె దించడంలోతాము కీలక పాత్ర పోషించామని, తీరా తమకు న్యాయం చేస్తుందని అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా గంప గుత్తగా అమ్మేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అన్ని డిపోలను కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమ్మెకు నోటీసు ఇచ్చినా ఇప్పటి వరకు సర్కార్ స్పందించ లేదని ఆరోపించారు. పరిస్థితి కంట్రోల్ కు రాక పోవడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.
ఇక గత్యంతరం లేక తాము సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో డిపోలకే పరిమితం కానున్నాయి ఆర్టీసీ బస్సులు. పూర్తిగా ప్రజా రవాణా స్తంభించి పోయింది. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు పూర్తయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి, సర్కార్ కు తెలియ చేశామని, కానీ సానుకూల స్పందన రాలేదన్నారు జేఏసీ నేతలు. మావి గొంతెమ్మ కోర్కెలు కాదని, గతంలో సర్కార్ ఇచ్చిన హామీలేనని పేర్కొన్నారు జేఏసీ నేతలు.ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు, బస్సులు ఆర్టీసీనే నడపడం మా డిమాండ్ అని ప్రకటించారు. కార్మిక జేఏసీ మా డిమాండ్లను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదన్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు.
















