అమెరికా : ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం డీఎన్ ఏలోనే ‘వైవిధ్యంలో ఏకత్వం’ ఇమిడి ఉందన్నారు. అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా సాధారణంగా ‘బహుళత్వం’ తో ముడిపడి ఉండగా ‘వైవిధ్యంలో ఏకత్వం’ అనేది భారతదేశాన్ని నిర్వచిస్తుందని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన విశ్వ ఏకత్వ వేడుకలో ప్రసంగించారు . వైవిధ్యం , ఏకత్వం కలిసి జీవించగలవని ప్రపంచానికి తెలియ జేయడమే భారతదేశ గమ్యమని ఆయన నొక్కి చెప్పారు. నేను భారతదేశంలోని నాగ్‌పూర్ నుండి ఈనాటి ఆనందాన్ని, స్ఫూర్తిని మీతో పంచు కోవడానికి ఇక్కడికి వచ్చాను. మనం ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ గురించి మాట్లాడినప్పుడు తరచుగా ఒక పదం చర్చకు వస్తుంది, అదే ‘బహుళత్వం’.
అదే భారతదేశం గురించి మాట్లాడినప్పుడు మరొక భావన చర్చకు వస్తుంది అదే ‘వైవిధ్యంలో ఏకత్వం’. ఈ ఏకత్వం , ఈ వైవిధ్యం రెండూ దాని డీఎన్ఏలోనే ఉన్నాయని భగవత్ అన్నారు. దేశాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాదని, అవి అంతకంటే గొప్ప పాత్రను పోషించాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. దేశాలు కేవలం భౌగోళిక సంస్థలు మాత్రమే కావు. ఈ విశ్వం యొక్క నిర్మాణంలో ఒక బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. స్వామి వివేకానంద ఇలా అన్నారు . ప్రతి దేశానికి ఒక సందేశం ఉంటుంది. ప్రతి దేశానికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి దేశానికి ఒక గమ్యం ఉంటుంది అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పేర్కొన్నారు. భారతదేశ పాత్ర గురించి ప్రస్తావిస్తూ, ‘వైవిధ్యంలో ఏకత్వం’ అనే సూత్రాన్ని స్వయంగా ఆచరించడం, ప్రపంచానికి పదేపదే తెలియ జేయడమే దేశ గమ్యమని భగవత్ అన్నారు. భారతదేశానికి నిర్దేశించబడిన విధి ఏమిటి? భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించడానికి, ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియ జేయడానికే భారతదేశం ఉంది. మనమంతా ఒక్కటే, భిన్నత్వం వలనే ఆ ఏకత్వం మరింత శోభాయమానంగా మారింది అని ఆయన అన్నారు.

















