హైదరాబాద్ : కేంద్రం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీరాజ్ సంస్థలకు గాను ప్రయోజనం చేకూర్చేలా రూ. 247.94 కోట్లు విడుదల చేసింది. ఈ గ్రాంట్లు క్షేత్రస్థాయి పాలనను మరింత బలోపేతం చేసేందుకు దోహద పడతాయి. పంచాయతీ రాజ్ సంస్థలలో అవసరాల ఆధారిత స్థానిక అభివృద్ధిని సాధ్యం చేస్తాయి. తెలంగాణతో సహా అరడజను రాష్ట్రాల్లోని పంచాయతీ రాజ్ సంస్థలు , గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పదిహేనవ ఆర్థిక సంఘం, అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసింది. గ్రాంట్లు పొందిన ఇతర ఐదు రాష్ట్రాలలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం , మేఘాలయ ఉన్నాయి.
తెలంగాణకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అన్‌టైడ్ గ్రాంట్ల మొదటి విడతగా రూ.247.94 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు రాష్ట్రంలోని అర్హత కలిగిన 12,600 గ్రామ పంచాయతీలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖల ద్వారా, పంచాయతీరాజ్ సంస్థలు, ప్రాంతీయ స్థానిక సంస్థల కోసం వీటిని కేటాయిస్తూ వస్తోంది కేంద్రం. ఇదిలా ఉండగా కేటాయించిన గ్రాంట్లను ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలలో సిఫార్సు చేసి విడుదల చేస్తారు. ఈ గ్రాంట్లను పంచాయతీరాజ్ సంస్థలు , ప్రాంతీయ స్థానిక సంస్థలు జీతాలు, ఇతర ఖర్చులతో పాటు రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్‌లో పొందు పరిచిన ఇరవై తొమ్మిది అంశాల కింద, తమ ప్రాంత-నిర్దిష్ట అవసరాల కోసం వినియోగించుకుంటాయి.

















