అల్పాహార పథకం కోసం రూ. 22.18 కోట్లు విరాళం

చెక్కులు అందించిన దివీస్, అర‌బిందో ఫార్మా

hellotelugu-CMCSR

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద పిల్ల‌ల ఆక‌లిని తీర్చేందుకు హ‌రేకృష్ణ ఫౌండేష‌న్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు అల్ప‌హార ప‌థ‌కం కింద భోజ‌నం అందిస్తోంది. ఈ మేర‌కు భారీ ఆదాయాన్ని పొందుతున్న కంపెనీలు కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) కింద విరాళాలు అంద‌జేస్తూ వ‌స్తున్నాయి. తాజాగా హైద‌రాబాద్ లోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరే కృష్ణ ఫౌండేషన్, దివీస్ , అరబిందో సంస్థల ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం సీఎస్ఆర్ నిధుల కింద, ముఖ్యమంత్రి సమక్షంలో దివీస్ సంస్థ రూ. 12.18 కోట్ల చెక్కును, అరబిందో ఫార్మా రూ. 10 కోట్ల చెక్కును ఫౌండేషన్‌కు అందజేశాయి.

హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం , మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ పథకం కోసం నిధులు అందించినందుకు దివీస్ మరియు అరబిందో సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు.ఈ పథకం అమలు కోసం హరే కృష్ణ ఫౌండేషన్ ఎక్కడైతే కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేసిందో, ఆయా ప్రాంతాల్లోని స్థానిక రైతులకు మద్దతు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి ప్రతినిధులకు వివరించారు. అవసరమైన కూరగాయలు, బియ్యం , ఇతర సరుకులను నేరుగా రైతుల నుండే సేకరించడం ద్వారా వారిని సేంద్రీయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్ల తెలిపారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారికి తెలియజేశారు. దీనివల్ల పంట మార్పిడి పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా, రైతులకు మంచి లాభాలు కూడా చేకూర్చవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్ , హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస్ ప్రభుజీ , దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు , అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి , ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version