నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం రూ.1,624 కోట్లు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

hellotellugu-CM

అమ‌రావ‌తి : 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రంలో తాగు నీటి మౌలిక వసతుల అభివృద్ధి క్రమంగా జరిగింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ కాలంలో 816 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, 1,072 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ జలాశయాలు, 28,086 ఓవర్ హెడ్ నిల్వ జలాశయాలు, 1.18 లక్షల కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. అయితే ‘అమరజీవి జలధార’ కార్యక్రమం ద్వారా కేవలం ఐదేళ్లలోనే ఈ మౌలిక వసతులకు భారీగా అదనపు సామర్థ్యాన్ని జోడిస్తున్నాం అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 1,426 ఎం.ఎల్.డి సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాలు, 494 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ జలాశయాలు, 13,075 ఓవర్ హెడ్ నిల్వ జలాశయాలు, 77 వేల కిలోమీటర్ల పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. గత ఏడు దశాబ్దాల్లో నిర్మించిన మౌలిక వసతులతో పోలిస్తే, కేవలం ఈ ఐదేళ్లలోనే 50 శాతం నుంచి 175 శాతం వరకు అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తున్నాం అన్నారు. రూ.9 వేల కోట్లతో 50,283 సింగిల్ విలేజ్ స్కీమ్స్, రెట్రోఫిట్టింగ్ పనులు, రూ.19,500 కోట్లతో 32 మల్టీ విలేజ్ స్కీమ్స్ చేపడుతున్నాం. నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం రూ.1,624 కోట్లు కేటాయించడం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం.

ఉద్దానం నుంచి డోన్ వరకు, కర్నూలు నుంచి కుప్పం వరకు, గండికోట, పీఏబీఆర్, ఏలేరు, తాండవ, హిరమండలం, ధవళేశ్వరం తదితర జలాశయాల ఆధారంగా తాగు నీటి పథకాలను చేపడుతున్నాం అన్నారు . ఉద్దానం, ఏ.కొండూరు వంటి కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలతో పాటు, రాయలసీమలోని కరువు ప్రభావిత ప్రాంతాలు, పులివెందుల, పుంగనూరు, పలమనేరు, గోదావరి ప్రాంతాల్లోని కాలుష్య ప్రభావిత ప్రాంతాలు, మార్కాపురం వంటి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లోనూ సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు. నీటి వనరులకు కొరత లేని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా తాగు నీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని రూ.6 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఆక్వా సాగు, పారిశ్రామిక కాలుష్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భూగర్భ, ఉపరితల నీటి వనరులు కలుషితమవు తున్నాయని పేర్కొన్నారు. అందుకే నీటి నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి పరీక్షిస్తున్నాం. కాలుష్యానికి కారణమవుతున్న ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. అదే సమయంలో, తాగునీటి పథకాల్లో నీటి శుద్ధికి కీలకమైన ఫిల్టర్ బెడ్స్ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.35 కోట్లతో 340 ఫిల్టర్ బెడ్స్‌ను పునరుద్ధరించాం. మరో 552 ఫిల్టర్ బెడ్స్‌ను రూ.88 కోట్లతో పునరుద్ధరిస్తున్నాం. పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ల నిర్వహణతో పాటు నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, ఇతర అవసరమైన సహాయక కార్యకలాపాల కోసం రూ.1,600 కోట్లు కేటాయించాం. నీటి శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్‌లలోని ఓపెనింగ్స్‌కు రక్షణ వలలు ఏర్పాటు చేసి బల్లులు, పురుగులు వంటి జీవులు లోపలికి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం అని తెలిపారు సీఎం.

Exit mobile version