అమరావతి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, దాని వల్ల కలిగిన ప్రయోజనాలు, ప్రస్తుతం చేపడుతున్న చర్యలతో భవిష్యత్ అంచనాలు ఎలా ఉంటాయనే అంశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ధిక శాఖపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. 46 పేజీలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ఆసాంతం పూస గుచ్చినట్టుగా మీడియాకు వివరించారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సుదీర్ఘంగా చెప్పారు. బడ్జెట్ లెక్కలు.. ఆర్థిక గణాంకాలు అందరికీ తెలియాలన్నారు. వీటిని బ్రహ్మ పదార్ధంగా చూడకూడదని, ప్రతి ఇంటికి వచ్చిన ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు ఎలా చేస్తారో తాము కూడా అంతే జాగ్రత్తగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలను అభివృద్ధి-సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని తెలిపారు.
ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు పెట్టుబడుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వివిధ రకాల పాలసీలను తెచ్చామని వివరించారు. విభజన నాటి పరిస్థితులు… ఆ తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలో నడిపించాం అన్నారు సీఎం. 2019లో ప్రభుత్వం కొనసాగక పోవడం వల్ల జరిగిన విధ్వంసం, మళ్లీ అధికారంలోకి వచ్చాక గత రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలు.. చర్యలు వంటి వాటిని ముఖ్యమంత్రి సోదాహరణంగా వివరించారు. గత రెండేళ్ల కాలంలో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం అగాధం నుంచి అభివృద్ధి వైపు వెళ్తోందని చెప్పారు. ఇంకా చాలా చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో సంక్షేమం కోసం రూ. 1,49,401 కోట్లను ఖర్చు పెట్టామని చెప్పారు.
అలాగే అభివృద్ధి పనులకూ భారీగానే నిధులను ఖర్చు పెట్టామని తెలిపారు. దీంట్లో భాగంగా రూ. 1,33,917 కోట్లను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు పెట్టాయని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే గత ప్రభుత్వం వదిలి వెళ్లిన పెండింగ్ బిల్లులు సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలనూ చెల్లించామని తెలిపారు. ఇవే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం నిధుల బదలాయింపు వంటి చెల్లింపులు కూడా చేశామని లెక్కలతో సహా సీఎం వివరించారు. వైసీపీ పాలనలో చేసిన ఘోర తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.94 లక్షల కోట్ల మేర జీఎస్డీపీ నష్టాన్ని చవి చూసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
