హైదరాబాద్ : భార్గవ్ మాచెర్ల రచన, దర్శకత్వం వహించిన చిత్రం రోమియో జూలియట్. ఈ సినిమా గురించి కీలక అప్ డేట్ వచ్చేసింది. మూవీ మేకర్స్ సినిమా విడుదల తేదీ గురించి ప్రస్తావించారు. వచ్చే నెల నవంబర్ 13న విడుదల కానుందని ప్రకటించారు. ‘రోమియో జూలియట్’. రూపొందిన ఈ చిత్రాన్ని సందీప్ ఎన్ , వెంకటేశ్వర రావు చల్లగుళ్ల నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘ఈటీవీ విన్’ సమర్పిస్తుండగా ‘మయూరి మూవీస్’ పంపిణీ చేస్తోంది. హర్షిత్, విశాఖ ధీమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తెలుగు చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ‘సారీ బేబీ’ అనే పాటను విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించి హర్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, తనకు మద్దతు తెలిపిన ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రంలో తాను పోషించిన పాత్ర తెలుగు సినిమాల్లోనే చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు భార్గవ్ మాట్లాడుతూ, ఈ సినిమా సంబంధాల నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన ప్రయాణమని అన్నారు. ఇందులో కామెడీ, డ్రామా, సామాజిక అంశాలు ఉన్నాయని తెలిపారు. ‘ఈటీవీ విన్’ బృందం స్పందిస్తూ ఇది యువతను ఆకట్టుకునేలా, ఆధునిక దృక్పథంతో సంబంధాలను ఆవిష్కరించే చిత్రమని పేర్కొంది. నటుడు ‘వివా’ హర్ష మాట్లాడుతూ ఈ సినిమా చాలా సరదాగా ఉంటుందని అన్నారు. అందరినీ అలరిస్తుందని చెప్పారు. విశాఖ ధీమాన్ మాట్లాడుతూ, సినిమా విడుదల తేదీ తన పుట్టినరోజుతో కలిసి రావడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రేమకథ,హాస్యభరిత సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం, ప్రేక్షకులకు థియేటర్లలో మంచి వినోదాన్ని అందిస్తుంది.
