అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పనితీరును ఢిల్లీలో సగర్వంగా చెప్పుకొనే స్థితికి తీసుకు రాగలిగాం అన్నారు మంత్రి మనోహర్. నాణ్యమైన సరకులు, మేలైన సేవలు, లాజిస్టిక్స్, రవాణాలో పారదర్శకత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భేష్ గా నిలిచి దేశంలోనే రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ నిలుస్తోందన్నారు. హోల్ సేల్ ధరలకు నిత్యావసర సరకులు అందించే మార్టులతో పోటీపడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మీ మార్టు’లను ఈ త్రైమాసికంలోనే ప్రారంభిస్తాం అని ప్రకటించారు. 1000 మార్టులను జిల్లాల వారీగా అవసరం ఉన్న చోట ప్రారంభిస్తాం అని తెలిపారు. దీనిపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఎన్.సి.సి.ఎఫ్. మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. మీ మార్టుల్లో అతి తక్కువ ధరకే సరకులు లభిస్తాయని చెప్పారు. 70 రకాల సరకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
సామాన్యుడికి ధరల భారం పెరగకుండా, ధరల స్థిరీకరణకు కట్టుబడి ఉన్నాం అని తెలిపారు మనోహర్. గత రెండు నెలలుగా రాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యుడు పడుతున్న ఇబ్బందులను మేం గుర్తించాం అన్నారు. దీంతో ఆగస్టు 1 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా బహిరంగ మార్కెట్లో రూ. 62 నుంచి రూ.64లు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ ను రూ.52లకు, బహిరంగ మార్కెట్లో రూ.58లు ధర ఉన్న గ్రేడ్ 1 రా రైస్ ను రూ.50లకు అందించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. గతంలో సేకరించి ఎఫ్.సి.ఐ. గోదాముల్లో భద్రపరిచిన స్వర్ణ వెరైటీ రకం బియ్యం లక్ష టన్నుల మేర నిల్వ ఉందని, దాన్ని కూడా వాడుకునేలా కేంద్ర మంత్రి అనుమతి అడిగాం అని చెప్పారు మనోహర్. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో వచ్చే రోజుల్లో స్వర్ణ వెరైటీ రకం బియ్యాన్ని కూడా రైతు బజార్ల ద్వారా రూ.40లకే అందించాలని భావిస్తున్నాం.
దీంతోపాటు రాష్ట్రానికి 73 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం అని కేంద్ర మంత్రి దగ్గర ప్రస్తావించామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 30 వేల చౌకధరల దుకాణాల్లో బియ్యం, పంచదారతో పాటు నాణ్యమైన కందిపప్పును ప్రతి కార్డుదారుడికి 500 గ్రాముల మేర అందించే ఏర్పాట్లు చేస్తాం అని ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రానికి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి రావాల్సిన కేంద్ర నిధులు రూ.281 కోట్లను వెంటనే చెల్లించేలా కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి బ్యాగు మీద క్యూఆర్ కోడ్ ఇప్పటి వరకు అమలు చేశాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారులు వేగం, నిర్దుష్ట సమాచారం వచ్చేలా రూపొందించిన ఆర్.ఎఫ్.ఐ.డి. విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందన్నారు.
