హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షమైన కరువు ఉంటే ముఖ్యమంత్రి అచేతన స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. వరుణ యాగం చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశాడని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కరువును ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యిందన్నారు. వెంటనే ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు చేసి కరువు, రైతు సమస్యలను తీర్చాలన్నారు కవిత. అడుక్కుంటారో, కొనుక్కుంటారో గానీ నవంబర్ వరకు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్ర కరువులో ఉన్న దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోకపోతే ప్రధాని మోడీని ప్రజలు క్షమించరన్నారు. దేశంలో ఈవీఎం లు పోయి పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు .
అప్పుడు మాత్రమే పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు కవిత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కు పోతోందన్నారు. అన్ని జిల్లాల్లో కరువు తాండవం చేస్తోంది. భూగర్బ జలాలు కొన్ని చోట్ల 20 మీటర్ల లోతుకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల రైతన్నలు తమ పంటలు కాల్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం అన్నారు. అయినా సర్కార్ కు సోయి ఉండడం లేదన్నారు. జులైలో 1 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే ఆగస్ట్ లో 38, సెప్టెంబర్ 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని ఆరు నెలల ముందే ప్రపంచానికి సైంటిస్టులు హెచ్చరించారన్నారు. ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కానీ ఈ ప్రభుత్వం ఏనాడు కనీసం రివ్యూ చేసి పరిస్థితిని తెలుసుకున్న పాపాన పోలేదన్నారు.
