అమరావతి : రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసి లబ్ది కలిగించేలా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు రాసిన రెండు వేర్వేరు లేఖల్లో స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇళ్లు కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలనే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఖరీఫ్-2026కి సంబంధించి పీఎం-ఆశా పథకం కింద కందులు, పెసలు, మినుములు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ వంటి 9 రకాల పంటల అంచనా దిగుబడిని 100 శాతం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు సీఎం . దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించి, తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి తప్పుతుందని పేర్కొన్నారు.
కృష్ణా, కాకినాడ జిల్లాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా చేసిన మార్పులను FFS యాప్‌లో చేర్చాలని, దీనివల్ల 2026-27 రబీ సీజన్ నాటికి ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయవచ్చని ముఖ్యమంత్రి లేఖలో వివరించారు. ఆర్‌కేవీవై కిసాన్ డ్రోన్ కార్యక్రమానికి ఆమోదించిన రూ.52.164 కోట్ల పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఈ నిధులు అందితే రాష్ట్రంలోని 1,130 గ్రామాల్లో యంత్ర పరికరాల బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తవుతుందని సీఎం లేఖలో తెలిపారు. అలాగే 5.69 లక్షల మట్టి నమూనాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.10.24 కోట్ల కమిటెడ్ లయబిలిటీ నిధులను, 2026-27 సంవత్సరానికి రావలసిన రూ.61.97 లక్షల మిగులు కేటాయింపులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు.
